ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీ దుర్ఘటన కేసులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రాకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. 8 వారాల పాటు షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం మంజూరు చేసింది. ఈ బెయిల్ వ్యవధిలో ఆశిశ్.. దేశ రాజధాని దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్‌లో ఉండరాదని.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
లఖింపుర్ ఖేరీ హింస కేసులో మిశ్రా బెయిల్ పిటిషన్‌ను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించింది. బెయిల్ నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతడి వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఆశిశ్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా నిందితుడు ఆశిశ్ మిశ్రా వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులను ఎల్లకాలం నిర్బంధించి ఉంచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో అత్యంత దారుణంగా కారాగారంలో మగ్గుతున్న బాధితులు రైతులేనని.. ఆశిశ్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేయకపోతే, వారు కూడా జైల్లోనే ఉండే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.