ఏపీలో రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ్టి నుంచే ఆ దిశగా సాగుతామని చెప్పారు. దుర్గమ్మ ఆశీస్సుల కోసం ఇంద్రకీలాద్రికి వచ్చినట్లు పవన్ తెలిపారు. తొలుత తెలంగాణలోని కొండగట్టులో వారాహికి పూజలు నిర్వహించినట్లు చెప్పారు.
విజయవాడ దివ్య క్షేత్రం కాబట్టి ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని పవన్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ముందుకు సాగాలని అభిలాషించారు. ఆలయానికి వచ్చిన పవన్‌కు జనసేన నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
తన రాజకీయ యాత్రలకు ఉపయోగించనున్న వారాహి వాహనానికి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు. తెలంగాణలో నిన్న కొండగట్టు, ధర్మపురి ఆలయాలను దర్శించుకుని పూజలు చేసిన పవన్.. నేరుగా విజయవాడ చేరుకున్నారు. పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలోని నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక అమలుపై చర్చించనున్నారు.