ప్రపంచంలో ఏ పార్టీని అయినా అపోజిషన్ పార్టీ ఎలా దెబ్బతీయాలా ? అని ఎత్తులు, పై ఎత్తులు వేస్తుంటుంది. కానీ పవర్ చేతిలో ఉన్నా..లేకున్నా తమను తామే ఎలా దెబ్బతీసుకోవాలో ? తమ నాయకులకు తామే ఎలా వెన్నుపోట్లు పొచుకోవాలో కాంగ్రెస్ నేతలు దిట్ట. ఈ విషయంలో వీరిని కొట్టేసే వాళ్లే ఉండరు. ఇక దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ? చూస్తూనే ఉన్నాం. వీళ్ల సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్ రోజు రోజుకు శరవేగంగా దిగజారుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాలుగు నెలలకే కాంగ్రెస్‌ను కేసీఆర్ ఖేల్ ఖతం చేసేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో ముగ్గురు కీలక అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీకి కొత్త ఊపిరి వచ్చినట్లయ్యింది. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎంపీలుగా గెలవడంతో పాటు మరో రెండు, మూడు సీట్లను ఆ పార్టీ స్వల్ప తేడాతో కోల్పోవడంతో కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత అదే ఉత్సాహం కంటిన్యూ చేయడంలో కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది. ఈ క్రమంలోనే ఉత్తమ్ ఎంపీగా గెలవడంతో టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక తెరమీదకు వచ్చింది.
గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధిని మారుస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఫైర్‌బ్రాండ్ లీడర్, సీఎం కేసీఆర్‌ను ఢీ అంటే ఢీ అనే రీతిలో ఢీ కొట్టే మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికే ఈ బాధ్యతలు ఇస్తారన్న టాక్ వచ్చింది. రేవంత్‌కు పీసీసీ పగ్గాలు ఇవ్వడం టీ కాంగ్రెస్‌లోనే చాలా మందికి నచ్చడం లేదు. సీనియర్లుగా ఉన్న వారు బాహాటంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న వి.హనుమంతరావు అయితే రేవంత్‌ను టార్గెట్‌గా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పీసీసీ చీఫ్ పోస్టు ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పార్టీలో ఆయారాం.. గయరాం లాంటి వారికే కీలక పదవులు ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వకుండా…ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఎలా ? ఇస్తారని ఆయన మండిపడ్డారు.
ఒక్క వీహెచ్ మాత్రమే కాదు. పార్టీలో చాలా మంది సీనియర్లు సైతం పీసీసీ చీప్ పదవిపై కన్నేసి ఉన్నారు. అయితే పార్టీ కేడర్ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్‌కు ఈ పదవి ఇస్తేనే కేసీఆర్‌ను ఢీ కొడతారని… పార్టీ బతుకుతుందని చెపుతున్నా… నేతలు మాత్రం రేవంత్‌ను టార్గెట్‌గా చేసుకుని పావులు కదపడంతో పాటు ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు.