ఏపీలో పథకాలు ఫుల్…పైసలు నిల్…

-

చేయాల్సినవి చాలా ఉన్నాయి..కానీ చేతిల్లో డబ్బులు లేవు. ప్రస్తుతం ఏపీలో సీఎం జగన్ పరిస్తితి ఇదే. ఊహించని విధంగా మెజారిటీ సీట్లు దక్కించుకుని అధికారం దక్కించుకున్న జగన్ వినూత్న నిర్ణయాలతో ముందుకు వెళుతూ ప్రజలకు ఏదో మంచి చేయాలని తాపత్రయ పడుతున్నారు. తాను హామీ ఇచ్చిన నవరత్నాలు ప్రజలకు చేరువ కావాలని ఆశపడుతున్నారు. జగన్ ఆశలు నెరవేరాలంటే ప్రభుత్వ ఖజానాలో పైసలు కూడా ఫుల్ గా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్తితి చూస్తే ఏపీ ఖజానా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


నాలుగు నెలలుగా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం అనుకున్నంతగా లేదు. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రెవిన్యూ రాబడిలో పలు శాఖల్లో  రాబడి బాగా తగ్గిపోయింది. అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు, జీతాలు, ఇతరత్రా ఖర్చులు చూస్తే అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప… తగ్గే అవకాశాలేమీ లేవు. అసలు ఈ ఆర్ధిక సంవత్సరం రాష్ట్ర ఆదాయం-ఖర్చులు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అయితే ఆర్ధిక పరిస్తితి ఇంతలా కుదేలు అవడానికి ముఖ్య కారణం ఎన్నికల ముందు గత సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే అని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తుంది.

ముఖంగా ఎన్నికల ముందు చంద్రబాబు పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ, రైతు రుణమాఫీలకు ఇతర శాఖల నిధులని భారీగా తరలించారని ఆరోపణలు ఉన్నాయి. అసలు జగన్ పాలన మొదలుపెట్టడమే ఖాళీ ఖజానాతో మొదలుపెట్టారు. పైగా ఆదాయం తెచ్చే పెట్టె కొన్ని శాఖల నుంచి ఆదాయం రాక తగ్గిపోయింది. ముఖ్యంగా వాణిజ్యపన్నుల ఆదాయంలో అనుకున్నంత వృద్ధి లేదు. ఇసుక దొరకపోవడంతో ఇనుము, ఉక్కు, సిమెంట్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీని ప్రభావం రాష్ట్ర ఖజానాపై పడింది.

మొత్తంగా వాణిజ్య పన్నుల్లో 14 శాతం వృద్ధి నమోదు కావాల్సి ఉండగా 5.3 శాతమే వచ్చింది. అటు వాహన రంగంలో మందగమనం వల్ల జీఎస్టీ తగ్గింది. ఒకవైపు ఆదాయం పరిస్తితి ఇలా ఉంటే జగన్ నవరత్నాల పేరుతో భారీగా హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేరాలంటే పైసలు గట్టిగానే ఉండాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పథకాల అమలుకు నిధులు సమకూర్చటం కష్టమైన పనే. అయితే అప్పు చేయాలి లేదా కేంద్రం సాయం చేయాలి. మరి జగన్ పథకాలకు పైసలు ఎక్కడనుంచి తెస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news