ఇటీవల విమానాల్లో ప్రయాణికుల వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి. తాజాగా విస్తారా విమానంలో ఇటలీకి చెందిన ఓ 45 ఏళ్ల మహిళ వీరంగం సృష్టించింది. సోమవారం (జనవరి 30) అబుదబీ నుంచి ముంబయి వచ్చిన విస్తారా విమానంలో ఎకానమీ క్లాస్ టికెట్ తీసుకున్న ఓ మహిళ తాను బిజినెస్ క్లాసులోనే కూర్చుంటానని పట్టుబట్టింది. అందుకు సిబ్బంది అంగీకరించకపోవడంతో వారిపై వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడింది. అంతటితో ఆగకుండా విమానంలో అటు ఇటూ అర్ధ నగ్నంగా తిరిగింది.
ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె వినిపించుకోకపోవడంతో కెప్టెన్ వార్నింగ్ కార్డ్ జారీ చేశారు. అనంతరం సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని ముంబయి ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆమెను అధికారులకు అప్పగించగా.. ఆ తర్వాత ముంబయి పోలీసులు ఆ ప్రయాణికురాలిని అరెస్టు చేశారు.
‘‘ప్రయాణికురాలి అసభ్య, హింసాత్మక ప్రవర్తన కారణంగా ఆమెను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఘటన గురించి ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బందికి సమాచారమిచ్చాం. వారు తగిన చర్యలు తీసుకున్నారు’’ అని విస్తారా ఓ ప్రకటనలో వెల్లడించింది