అమెరికా గగనతలంలో మరోసారి చైనా నిఘా బెలూన్ కలకలం రేపింది. అణుస్థావరం వద్ద బెలూన్ సంచరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. దీంతో విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ఇప్పుడు మరో బెలూన్ వ్యవహారం వెలుగు చూసింది. లాటిన్ అమెరికా ప్రాంతంలో గగనతలంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మరో బెలూన్ను అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ధ్రువీకరించింది. “ఒక బెలూన్ లాటిన్ అమెరికా దిశగా ప్రయాణిస్తున్నట్లు మేం గుర్తించాం. ఇది చైనా నిఘా బెలూన్గానే భావిస్తున్నాం” అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు.
అంతకుముందు గురువారం.. అమెరికా గగనతలంలో ఓ బెలూన్ సంచరించడం కలకలం రేపింది. మోంటానా(అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటి)లో బెలూన్ ప్రత్యక్షమైందని పెంటగాన్ పేర్కొంది. అయితే అత్యంత ఎత్తులో ఎగరడం వల్ల విమానాల రాకపోకలకు దానివల్ల అంతరాయమేమీ కలుగలేదు. అయినప్పటికీ కీలక సమాచారం లీక్ అయ్యే ఛాన్స్ ఉండడం వల్ల.. అమెరికా జాగ్రత్త పడింది.