తెలంగాణలో మంత్రి పదవి రాకపోవంతో పలువురు నేతలు ఏదో ఒక రూపంలో తమ అసంతృప్తి, అసమ్మతి వినిపిస్తున్నారు. ఇప్పటికే నలురుగైదుగురు ఎమ్మెల్యేలు తమ బాధను ఏదో ఒక రూపంలో వ్యక్తం చేశారు. ఇక మాజీ మంత్రి జోగు రామన్న మంత్రి పదవి రాలేదని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు రెండు రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆయన అజ్ఞాతం వీడి బయటకు వచ్చి ప్రెస్‌మీట్ పెట్టారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే జోగు రామన్న కంటతడి పెట్టారు. మంత్రి పదవి రాకపోవడంతో మనస్తాపం చెందినట్లు మీడియా సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తారని ఆశతో ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్ తొలి కేబినెట్లోనే తాను మంత్రిగా ఎలా సక్సెస్ అయ్యానో అందరూ చూశారని అన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి మచ్చలేని వ్యక్తిగా ఉన్న తనకు మంత్రి పదవి రాకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు పేర్కొన్నారు.
మంత్రి పదవిపై ఎంతో ఆశతో ఉన్న తనకు పదవి రాకపోవడంతో హైబీపీతోనే హాస్పటల్లో జాయిన్ అయ్యానన్నారు. అంతే తప్ప తనకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కేసీఆరే తమ నాయకుడిగా చెప్పుకొచ్చారు. ఇక మున్నూరు కాపు కోటాలో రామన్న మంత్రి పదవి ఆశించారు. అయితే కేసీఆర్ అదే సామాజికవర్గానికి చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి ఇచ్చారు. ఇదిలా ఉంటే తమ నాయకుడు జోగు రామన్నకు మంత్రి పదవి రాలేదన్న బాధతో ఆయన అభిమాని జిల్లా కేంద్రంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.