తెలంగాణ యాదవులకు శుభవార్త. త్వరలో రెండో దశ గొర్రెల పంపిణీని చేపడతామని రాష్ట్ర పశుసంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. ఇప్పటికే డీడీలు కట్టిన వారికి గొర్రెలు అందజేస్తామని, మిగిలిన వారి చేత డీడీలు కట్టించాలని ఆయన ఎమ్మెల్యేలను కోరారు.
గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు నోముల భగత్, చల్లా ధర్మారెడ్డి, సుంకే రవిశంకర్, సండ్ర వెంకట వీరయ్య అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. గ్రామీణ వృత్తి వికాసం కోసం దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు. గొర్రెల పంపిణీ మొదటి దశ ద్వారా రాష్ట్రంలోని యాదవ సోదరులు లబ్ధి పొందారని, అదే స్ఫూర్తితో రెండో దశను త్వరలో చేపడుతామన్నారు.