60 ఏళ్ల రికార్డు.. చరిత్ర సృష్టించిన నిమ్మకాయల ధర

-

ఒక నిమ్మకాయ రేటు ఎంత? ఈ ప్రశ్న వేస్తే.. పొద్దుపొద్దునే ఈ సోది ప్రశ్నలు ఏంటి బాసూ? అన్న కోపం రావొచ్చు. కానీ.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. నిత్యం ఏదో రూపంలో వినియోగించే నిమ్మకాయ ధర ఇంత భారీగా పెరిగిందా? అన్న షాక్ తప్పదు. ఉదయాన్నే నీళ్లు.. నిమ్మకాయ.. తేన వాడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో.. గతంలో మాదిరి నిమ్మకాయను వంటకు మాత్రమే వాడట్లేదు. చాలా రకాలుగా వాడేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో నిమ్మకాయ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే.. హైదరాబాద్ లో ఒక నిమ్మకాయ రిటైల్ షాపులో ఏకంగా రూ.10 వరకూ అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది.
విడి రోజుల్లో రూ.20లకు దాదాపు డజనకు పైనే నిమ్మకాయలు ఇచ్చే వారు.. ఇప్పుడు ఒక్కో నిమ్మకాయ లెక్కన అమ్మటం మొదలైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నిమ్మ పంట మీద తీవ్ర ప్రభావాన్ని చూపించినట్లు చెబుతున్నారు. ఈ కారణంగా నిమ్మ పంట భారీగా నష్టపోవటంతో నిమ్మకాయ ధర భారీగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

రిటైల్ మార్కెట్ లో నిమ్మకాయ ఒక్కొక్కటి రూ.10 చొప్పున పలుకుతుంటే.. ఇక హోల్ సేల్ గా చిన్న సిమెంటు బస్తాల లెక్కన అమ్ముతుంటారు.  ఒక బస్తా నిమ్మకాయల ధర ఏకంగా రూ.15,500 పలకటం ఒక రికార్డుగా చెబుతున్నారు. నిమ్మకాలు అన్నంతనే గుర్తుకు వచ్చేది ఏపీలోని ఏలూరు.. గుంటూరు.. గూడురు ప్రాంతాలుగా చెబుతారు. అయితే.. మిగిలిన వాటితో పోలిస్తే..గూడురు నిమ్మకాయలకు మంచి మార్కెట్ ఉంది. తాజాగా పెరిగిన ధరల కారణంగా గడిచిన 60 ఏళ్లలో ఎప్పుడూ పలకనంత భారీగా రేట్లు పలుకుతున్నాయని వ్యాపారులు వెల్లడిస్తున్నారు.

గత ఏడాది నిమ్మకాయల బస్తా రేటు గరిష్ఠంగా రూ.9వేల వరకూ పలికిందని.. అప్పటికి అదే రికార్డు అని.. తాజాగా మాత్రం పాత రికార్డు ధరలకు ఏ మాత్రం పోలిక లేని రీతిలో రూ.15,500 పలకటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఏపీలో పండే నిమ్మకాలు వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. పెరిగిన ధర వ్యాపారులకు.. వినియోగదారులకు మంట పుట్టిస్తుంటే.. రైతులు మాత్రం తొలిసారి భారీగా పెరిగిన ధరను చూసి ఫుల్ హ్యాపీగా ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news