హమ్మయ్య.. ఎట్టకేలకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క విషయాన్ని మాత్రం గుర్తించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత అంతర్మథనంలో పడిపోయిన బాబుగారు నూతన జోష్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందు కోసం పార్టీకి నూతన నాయకత్వం అవసరమని ప్రకటించారు. ఈనెల 14న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీ టీడీపీ 17 పార్లెమంట్ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సభ్యులు, ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు.
తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీకి నూతన నాయకత్వం అంటే యువ నాయకత్వం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీని పునర్నిర్మాణం చేస్తానని, తెలంగాణలో టీడీపీ చారిత్రక అవసరమని బాబు అన్నారు. అయితే.. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇక తెలంగాణలో కూడా సత్తా చాటింది. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్‌ను తట్టుకుని 18స్థానాల్లో విజయం సాధించింది. అయితే.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కావడం.. తెలంగాణలో పార్టీని పట్టించుకోకపోవడంతో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడిపోయారు. ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. రేవంత్‌రెడ్డి లాంటి కీలక నేత కూడా పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.
ఇక ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పార్టీని వీడిపోయారు. ఇక 2018లో తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీడీపీ కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. ఇక ఏపీలో టీడీపీ ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే.. ఇక్కడ విషయం ఏమిటంటే.. 2014 ఎన్నికల్లో సత్తాచాటిన పార్టీని కాపాడుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారు. ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీని వీడుతున్నా.. ఆయన ఎనాడూ పట్టించుకోలేదనే చెప్పొచ్చు. ఇప్పుడు ఏకంగా ఇటు తెలంగాణలో ఉనికే కరువైంది. ఇక ఏపీలో కష్టాల్లో పడిపోయింది. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను ఎక్కువగా యువ నాయకులకే కేటాయించారు.
ఇక చంద్రబాబు మాత్రం చాలా వరకు వృద్ధనేతలతోనే బరిలోకి దిగారు. జరగాల్సిన నష్టం జరిగాక తేరుకున్న చంద్రబాబు పార్టీకి నూతన నాయకత్వం గుర్తించడం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉందని పలువురు నాయకులు అంటున్నారు. కోలుకోలేని స్థాయికి పడిపోయిన పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని చంద్రబాబు చెప్పడం తమ్ముళ్లకు కాస్త భరోసా ఇచ్చినట్టే ఉంది కానీ.. అదంతా సులభం కాదు.