రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భద్రతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముకేశ్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అత్యున్నత Z+ భద్రత కల్పించాలని ఆదేశించింది. ఈ సెక్యూరిటీ అందించడానికి అయ్యే ఖర్చులు మొత్తం అంబానీయే భరించాలని స్పష్టం చేసింది. జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
అంబానీ సెక్యూరిటీ గురించి త్రిపురకు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఆ పిటిషన్ లో అంబానీ కుటుంబం భద్రత మహారాష్ట్రకు మాత్రమే పరిమితమా? దేశ విదేశాల్లోనూ అమలు చేస్తారా? అన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం.. ముకేశ్ అంబానీ ఇండియాలో ఉన్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత కల్పిస్తుందని పేర్కొంది. ఇక విదేశాలకు వెళ్లినప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రతా ఏర్పాట్లను కల్పించాలని సూచించింది.