ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు.. సీబీఐకి హైకోర్టు ఆదేశం

-

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. సీబీఐ మరోసారి అవినాష్ ను విచారించింది. మరోవైపు తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని.. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపి.. దాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరుతూ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది.

తీవ్రమైన చర్యలు అంటే ఏంటని కోర్టు అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వమని అడుగుతున్నారా అని అడిగింది. సీఆర్‌పీసీ 160 కింద నోటీసు ఇచ్చినప్పటికీ.. అవినాష్ రెడ్డే నేరం అంగీకరించినట్లు తప్పుడు వాంగ్మూలం నమోదు చేసే అవకాశం ఉందని సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది కోర్టును  కోరారు.

ఈ కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడా.. సాక్ష్యా అని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. అవినాష్‌రెడ్డిని ఇప్పటి వరకు సాంకేతికంగా సాక్షిగా పరిగణిస్తున్నప్పటికీ.. ఆయన ప్రమేయంపై బలమైన అనుమానాలు ఉన్నాయని తెలిపింది. అవసరమైతే అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ పేర్కొంది.

సోమవారం వరకు అరెస్టు చేయవద్దని సీబీఐకి హైకోర్టు స్పష్టం చేసింది. మంగళవారం అవినాష్‌రెడ్డిని మళ్లీ పిలుస్తామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. విచారణ సందర్భంగా న్యాయవాదిని కూడా అనుమతించాలని అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది కోరగా.. హైకోర్టు అంగీకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news