తీసుకున్న అప్పుల‌న్నీ తీర్చేస్తానంటున్న విజ‌య్ మాల్యా..!

-

దేశంలోని ప‌లు బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయ‌ల రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టి లండ‌న్‌కు పారిపోయి త‌ప్పించుకు తిరుగుతున్న విజ‌య్ మాల్యా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తాను తీసుకున్న రుణాల‌న్నింటినీ తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపాడు. 2016లో మార్చి నెల‌లో మాల్యా భార‌త్ నుంచి పారిపోగా, అప్ప‌టి నుంచి మాల్యాను భార‌త్‌కు ర‌ప్పించేందుకు అధికారులు విశ్వ ప్ర‌యత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే లండ‌న్ కోర్టులో కేసు కూడా న‌డుస్తోంది. అయితే ఎప్పటిక‌ప్పుడు మాల్యాను అరెస్టు చేయాలని చూసినా అత‌ను వెంట‌నే బెయిల్ తెచ్చుకుంటుండ‌డంతో అధికారులు కూడా చేసేదేమీ లేక దిక్కులు చూస్తున్నారు.

కాగా విజ‌య్ మాల్యా తాను తీసుకున్న రుణాల‌ను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని తెల‌ప‌డంతోపాటు తాను భారత్ వ‌దిలి వెళ్లేముందు ఆర్థిక మంత్రి జైట్లీతో మాట్లాడాన‌ని చెప్ప‌డం కూడా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం ఈ విష‌యాన్ని ఖండించారు. తన‌తో మాల్యా ఎప్పుడు కూడా మాట్లాడ‌లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా, రుణాల ఎగ‌వేత‌పై మాల్యా స్పందిస్తూ.. ఈ ఏడాది జూన్ 22వ తేదీన తాను క‌ర్ణాట‌క హైకోర్టులో ఓ ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నాన‌ని, కోర్టు ఆధీనంలో ఉన్న ఆస్తుల‌ను అమ్మి అప్పుల‌ను తీరుస్తాన‌ని చెప్పాన‌ని మాల్యా తెలిపాడు. ఈ విష‌యంలో న్యాయ‌మూర్తి తీసుకునే నిర్ణ‌యం కోసం ఎదురు చూస్తున్నాన‌ని మాల్యా అన్నాడు.

అయితే మాల్యాను భార‌త్‌కు పంపే విష‌యంపై లండ‌న్ కోర్టులో గ‌త కొంత కాలంగా విచార‌ణ జ‌రుగుతుండ‌గా, మాల్యా భార‌త్‌లోని జైళ్ల పట్ల అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. భార‌త్ లో జైళ్లు స‌రిగ్గా ఉండ‌వ‌ని చెప్ప‌డంతో.. భార‌త అధికారులు అన్ని వ‌స‌తుల‌తో కూడిన జైలు గ‌ది వీడియోను లండ‌న్ కోర్టు జ‌డ్జికి పంపారు. దాన్ని అక్క‌డి న్యాయ‌మూర్తి 3 సార్లు ప‌రిశీలించారు. మ‌రి మాల్యాను భారత్‌కు ఎప్పుడు తీసుకొస్తారో వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news