కేరళలో గత నెలలో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన మొత్తం నష్టం విలువ రూ.40వేల కోట్ల వరకు ఉంటుందని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఈపీ జయరాజన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అనంతరం మాట్లాడుతూ.. తాము ఇంకా వరద నష్టాన్ని పూర్తిగా అంచనా వేయలేదని అన్నారు. నష్టం విలువ రూ.40వేల కోట్ల కన్నా ఇంకా ఎక్కువకే చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. కాగా వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, ఐఎఫ్‌సీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు.
కేరళ రాష్ట్రంలో మరో మూడు, నాలుగు రోజుల్లో వరద నష్టం అంచనా కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని మంత్రి జయరాజన్ తెలిపారు. ఈ నెల 21వ తేదీన ప్రపంచ ఆర్థిక సంస్థల ప్రతినిధులు వరద నష్టం అంచనా నివేదికను ఇస్తారని అన్నారు. ఇక ఇప్పటికే వరద బాధిత కుటుంబాలకు కుటుంబానికి రూ.10వేల చొప్పున ఇస్తున్నామన్నారు. 5 లక్షల కుటుంబాలకు ఇలా ఇప్పటికే ఇచ్చామని, మరో 96,500 కుటుంబాలకు కుటుంబానికి రూ.10వేల చొప్పున ఇస్తామన్నారు. ఇందుకు గాను 2 రోజుల సమయం పడుతుందన్నారు.
6.89 లక్షల నివాసాలను ఇప్పటికే శుభ్రం చేశామని మంత్రి జయరాజన్ తెలిపారు. ఇంకా 122 పునరావాస కేంద్రాల్లో 4,857 మంది ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. కాగా కేరళలో మే 29 నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షాల కారణంగా 491 మంది మృతి చెందారు.