ఖమ్మం జిల్లా పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో సీఎం వెళ్తున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. రైతులను కలిసి పరామర్శించి భరోసా కల్పించనున్నారు. ఖమ్మం పర్యటన అనంతరం మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు సీఎం వెళ్లనున్నారు.
ఖమ్మం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్ కాసేపట్లో మధిర నియోజకవర్గానికి వెళ్లనున్నారు. బోనకల్ మండలం గార్లపాడులో వర్షం వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. రావినూతల-గార్లపాడు మార్గంలో పంటలు పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు.
మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షా 11 వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు ఇప్పటివరకూ అంచనా వేశారు. పూర్తి స్థాయి లెక్కలు పూర్తయితే.. నష్టం మరింత పెరిగే అవకాశముంది. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యవేక్షిస్తున్నారు. హెలీప్యాడ్తో పాటు భారీ బందోబస్తుతో ఏర్పాట్లు చేస్తున్నారు.
అకాల వర్షాలతో పంట నీటిపాలు కావటంతో ఆయా జిల్లాల్లో రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి స్వయంగా తమ ప్రాంతాల్లో పర్యటిస్తుండటం పట్ల ఆశలు నెలకొన్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.