భద్రాచలం సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. మిథిలా ప్రాంగణంలో ఇవాళ సీతారాముల కల్యాణం కన్నులపండువగా జరగనుంది. స్వామి వారి వివాహ వేడుకకు ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించారు.
మరోవైపు.. రాములోరి పెళ్లికి ఖమ్మం నగరానికి చెందిన అనంత పద్మనాభ కోలాట భజన భక్తబృందం గోటి తలంబ్రాలను సమర్పించింది. పతకముడి లక్ష్మి సారథ్యంలో బృంద సభ్యులు ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెంలో వరినాట్లు వేసి పంట పండించారు. 50 కిలోల వడ్లు పండగా రఘునాథపాలెం, వీఆర్‌బంజర, చింతపల్లి, కోయచెలక, రేగులచెలక, గణేశ్వరం, కోటపాడు, భయన్నపాడు, ఆంధ్రప్రదేశ్‌లోని గూడవల్లి, చెరుకుపల్లి గ్రామాలకు ఉచితంగా గోటి తలంబ్రాల కోసం పంచిపెట్టారు. ఈ బృందం గోటితో ఒలిచిన 8 కిలోల తలంబ్రాలను భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయానికి అందజేశారు.