మందుల ధరలు పెంపుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. బిజెపి పాలనలో అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సఛ్చే దిన్ అని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12% పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణం అన్నారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య అని.. జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800 పైగా నిత్యావసర మందుల ధరలు పెంచితే, అది పేద, మధ్య తరగతి ప్రజలకి భారం అవుతుందన్నారు.
సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బిజెపి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్దమైందని.. ఇది అత్యంత బాధాకరం. దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా బిజెపి చెబుతున్న అమృత్ కాల్..?? అని నిలదీశారు. దేశంలో బిజెపి పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు.