మరో నెలరోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలపై గురి పెట్టాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం పార్టీ సిద్ధమైంది. తాము 25 స్థానాల్లో పోటీ చేస్తామని ఆ రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు.. ఉస్మాన్ ఘనీ ఇవాళ వెల్లడించారు. జేడీఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తాము సుముఖంగా ఉన్నట్లు ఉస్మాన్ ఘనీ తెలిపారు.
“జేడీఎస్‌తో ఎమ్ఐఎమ్ పొత్తుపై ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ప్రధాని ఎచ్డీ దేవేగౌడతో.. చర్చలు జరుపుతున్నాం. పార్టీ అభిప్రాయాన్ని ఆయనకు చెప్పాం. కానీ దేవెగౌడ ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదు” అని ఉస్మాన్ ఘనీ అన్నారు.
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ సైతం తాము కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాము ముగ్గురు అభ్యర్థులను ప్రకటించామని తెలిపారు. జేడీఎస్‌తో పొత్తుకు ఎంఐఎం సిద్ధంగా ఉందన్న ఆయన.. దానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని చెప్పారు. పొత్తు కోసం వేచి చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు.