పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం సంజయ్ హనుమకొండ కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన హనుమకొండ కోర్టు సంజయ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ బండి సంజయ్.. కరీంనగర్ కారాగారం నుంచి విడుదలయ్యారు.
జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ముఖ్యమంత్రి కుమారుడిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. పరీక్షలు రాసే అభ్యర్థులకు రూ.లక్ష సాయం చేయాలి. పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం ఎవరైనా లీక్ చేస్తారా..? ముందురోజు పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రం ఎవరు లీక్ చేశారు..? పదోతరగతి పత్రాల లీక్ ఘటనను కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే దమ్ముందా..? చిల్లర బుద్ధులు.. చిల్లర వ్యవహారాలు మీవే.. మావి కాదు. త్వరలో వరంగల్లో నిరుద్యోగ యువతతో భారీ ర్యాలీ నిర్వహిస్తాం.’ అని బండి సంజయ్ అన్నారు.