బీజేపీ ఓటింగ్‌ శాతంపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్‌

-

బీజేపీ ఓటింగ్‌ శాతంపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్‌ చేశారు. ప్రస్తుత లోక్‌ సభ ఏర్పాటుకు పోలింగ్‌ ప్రక్రియ సరిగ్గా 4 ఏళ్ల క్రితం 2019 ఏప్రిల్‌ 11న మొదలైంది. ఏడు దశల్లో జరిగిన పార్లమెంటు దిగువసభ 17వ ఎన్నికల తుది దశ పోలింగ్‌ మే 19న ముగిసింది. ఫలితాలు అదే నెల 23న ప్రకటించారు. నాలుగేళ్ల కిందటి ఈ విషయాలు గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఏమంటే–18వ లోక్‌ సభ ఎన్నికలు వచ్చే వేసవిలో జరగాల్సి ఉండగా అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కిందన్నారు.


2019 మే 24న ఏర్పాటైన ప్రస్తుత లోక్‌ సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విశేషాలున్నాయి. దేశంలో 1984 తర్వాత పాలకపక్షానికి వరుసగా రెండోసారి మెజారిటీ (272 సీట్లు) రావడం 2019 పార్లమెంటు ఎన్నికల్లోనే జరిగింది. 1980 లోక్‌ సభ మధ్యంతర ఎన్నికల్లో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించగా, ఆమె మరణానంతరం ఆమె కుమారుడు దివంగత రాజీవ్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ మరుసటి ఎన్నికల్లో (1984) కూడా తిరుగులేని మెజారిటీ సాధించిందని వివరించారు.

ఇలా ఒక పాలక రాజకీయపక్షం రెండు వరుస విజయాలు దాదాపు మూడు దశాబ్దాల వరకూ సాధించలేదు. 2014లో తొలిసారి మెజారిటీ (282 సీట్లు) గెల్చుకుంది బీజేపీ. మళ్లీ 2019 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రమే అప్పటికి ఐదేళ్లుగా అధికారంలో ఉన్న రాజకీయపక్షం బీజేపీ రెండోసారి కూడా సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఒకవేళ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీజేపీ మెజారిటీ స్థానాలు సంపాదించి మూడోసారి అధికారంలోకి వస్తే 21వ శతాబ్దంలో ఇండియాలో ఇదొక రికార్డు అవుతుంది. కాంగ్రెస్‌ పార్టీ వరుసగా మూడు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు చివరిసారిగా గెలుచుకున్న ఎన్నికలు–1962, 1967, 1971. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ గాని, మరో పార్టీ గాని వరుసగా మూడు లోక్‌ సభ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ సీట్లు కైవసం చేసుకోలేదు. తక్కువ ఓట్ల శాతంతో బీజేపీకి మెజారిటీ సీట్లు ఇచ్చిన 2014, 2019 ఎన్నికలు అన్నారు విజయసాయిరెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news