ఆర్థిక మాంద్యం భయాలతో గూగుల్‌లో పెద్ద సంఖ్యలో లేఆఫ్‌లు చేపడుతున్న వేళ.. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ 2022 సంవత్సరానికి గానూ 226 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.1850కోట్లకు పైమాటే) పారితోషికం అందుకున్నారు. ఈ మేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. కంపెనీలో సగటు ఉద్యోగి వేతనంతో పోల్చితే.. ఇది 800 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
మూడేళ్ల కాలానికి సుందర్ పిచాయ్ ఈ స్టాక్ అవార్డును అందుకున్నారు. 2019లోనూ ఆయన ఇదే స్థాయిలో ప్యాకేజీ తీసుకున్నారు. ఆ ఏడాది స్టాక్ అవార్డుల రూపంలో ఆయనకు 281 మిలియన్ డాలర్ల పారితోషికం అందింది. ఇక, గత మూడేళ్లుగా పిచాయ్ స్థిరంగా 2 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం అందుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది.
ఖర్చు నియంత్రణలో భాగంగా 12వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆల్ఫాబెట్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సంస్థలో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో ఇది 6 శాతం కావడం గమనార్హం.