అధికార వైసీపీలో కీలక చర్చ సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం కూడా దసరా ఉత్సవాల్లో మునిగిపోయింది. దేశంలో జరిగే అతి పెద్ద పండుగల్లో ఇది కూడా ఒకటి కావడంతో అందరూ ఈ పండుగను బాగానే ఆశ్వాదిస్తున్నారు. ఇక, ఇదే సమయంలో విజయదశిమిని పురస్కరించుకుని.. అనేక కీలక కార్యక్రమాలకు కూడా ప్రారంభాలు జరుగుతుంటాయి. అదేవిధం గా రాజకీయ నాయకులు తమ కొత్త కార్యక్రమాలను ఈ పండుగ రోజే ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితిని అందరూ ఆహ్వానిస్తారు. అయితే, వైసీపీ చర్చలో కొత్త కోణం కనిపిస్తోంది. టీడీపీకి అసలు దసరా ముందుందని, ఇది కాదని వారు చెవులు కొరుక్కొంటున్నారు.
దీని వెనుక వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహం ఉందని నాయకులు చర్చించుకుంటున్నట్టు సమాచారం. ఇటీవల ఆయన పార్టీని బలోపేతం చేసే క్రమంలో నాయకులకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. అయితే, వాటి విషయంపై పెద్దగా మీడియాలో ప్రొజెక్ట్ కాలేదు. కానీ, రోజులు గడిచే కొద్దీ.. నాలుగు రోజుల కిందట జగన్ చేసిన వ్యాఖ్యల సారాంశం మాత్రం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. వీటిలో ప్రధానంగా టీడీపీకి చెందిన కీలక నేతలపై ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించడం, ముఖ్యంగా ఆ పార్టీకి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎవరు పార్టీలోకి వచ్చినా.. తీసుకుని తీరాలని, అంతేకాదు, వచ్చేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని పేర్కొంటూ.. జగన్ ఈ బాధ్యతలను కొందరు సీనియర్లకు అప్పగించారని తాజాగా వెల్లడైంది.
ఈ నేపథ్యంలో ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా నుంచి వైసీపీలోకి చేరిన ఓ కాపు నేతకు కనీసం పది మంది నాయకులనైనా తీసుకు వచ్చే బాధ్యతను జగన్ నేరుగా అప్పగించారని, ఆయన ప్రతిభకు దానినే కొలమానంగా ఆయన పేర్కొన్నారని అంటున్నారు. అదేసమయంలో ఇలా వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం, ఇప్పటికే ఉన్న వారికి తగ్గి పోతుందనే ఆందోళన విషయంలో జగన్ కొన్ని సూచనలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి అంటే 2024 నాటికి రాష్ట్రంలో మరో 50 అసెంబ్లీ స్థానాలు పెరిగడం ఖాయమని, కాబట్టి.. ఎందరు వచ్చినా.. పార్టీలో ఇప్పటికే ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని కూడా జగన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జగన్ వ్యూహం బయటకు పొక్కగానే చాలా మంది టీడీపీ నాయకులు పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారని సమాచారం. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మినహా కీలక నాయకులు ఉన్నారని చర్చ సాగుతోంది. నిజానికి వీరు పార్టీకి చాలా అండగా ఉన్నారు. అలాంటి వారిని వైసీపీలోకి చేర్చుకోవడం ద్వారా పార్టీ బలోపేతం కావడంతోపాటు. టీడీపీ బలహీనపడడం ఖాయమని జగన్ తలపోస్తున్నారు. మరోపక్క, చంద్రబాబు నాయకత్వంపై నానాటికీ నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఆయన మాటలను విశ్వసించే వారు లేక పోవడం, ఆయన పెడుతున్న సమావేశాలకు డుమ్మా కొడుతున్నవారు పెరుగుతుండడంతో రాబోయే రోజుల్లో నిజంగానే వైసీపీ నేతలు చెబుతున్న టీడీపీ పెద్ద దసరా ఎదరు కానుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఏంజరుగుతుందో చూడాలి.