టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. ఆ ఐదుగురి కస్టడీకి ఈడీ పిటిషన్

-

టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఓవైపు సిట్.. మరోవైపు ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపింది. ఈ విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలతో మరి కొందరిని అరెస్టు చేసింది. అయితే తాజాగా  ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్‌ చేసిన నిందితుల్లో అయిదుగురిని విచారించడంపై ఈడీ దృష్టి సారించింది. నిందితులు రేణుక, రాజేశ్వర్‌నాయక్‌, డాక్యానాయక్‌, గోపాల్‌నాయక్‌, షమీమ్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతించాలని న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది. ఈ క్రమంలో న్యాయస్థానం నిందితులకు నోటీసులు జారీ చేసింది.

వాదనల అనంతరం న్యాయస్థానం అనుమతి ఇస్తే వీరి విచారణ జరిగే అవకాశముంది. లీకేజీ వ్యవహారంలో దాదాపు రూ.40 లక్షలు చేతులు మారినట్లు సిట్‌ దర్యాప్తులో ఇప్పటికే వెల్లడైంది. ఇందులో మరికొందరి పాత్ర ఉందని అనుమానిస్తున్న ఈడీ.. వారి గుట్టు తేల్చేందుకే రంగంలోకి దిగిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కీలక నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌ను చంచల్‌గూడ జైలుకు వెళ్లి విచారించింది. టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితారామచంద్రన్‌, అధికారులు సత్యనారాయణ, శంకర్‌లక్ష్మిని విచారించి వాంగ్మూలాలను సేకరించింది. తాజాగా అయిదుగురి విచారణకు న్యాయస్థానం అనుమతి కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news