జేపీఎస్‌లు నేడు విధుల్లో చేరాల్సిందే.. మధ్యాహ్నం 12 గంటల వరకే ఛాన్స్

-

రాష్ట్రంలో సమ్మె చేస్తున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల లోపు విధుల్లో చేరాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. విధులకు హాజరుకాని వారి స్థానంలో తాత్కాలికంగా రూ.15 వేల నెల వేతనంతో కొత్త జేపీఎస్‌లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం రోజున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

గత 15 రోజులుగా జేపీఎస్‌ల సమ్మె కొనసాగుతోంది. జేపీఎస్‌ సోని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో సమ్మె చేస్తున్న జేపీఎస్‌లపై కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారని తెలిసింది. ఇప్పటికే సోమవారం వరకు వారికి గడువు ఇచ్చారు. తుది దఫాగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించారు.

ఆలోగా విధుల్లో చేరిన వారిని కొనసాగించాలని, గైర్హాజరైన వారిని తొలగించాలని సూచించారు. విధులకు హాజరైన వారి జాబితాను మండల పరిషత్‌ అధికారులు ఇవాళ మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా కలెక్టర్లకు పంపించాలని సూచించారు. విధులకు హాజరు కాని వారిని తొలగించి, వారి స్థానాలను ఖాళీలుగా చూపించి వెంటనే నియామకాలు చేపట్టి కొత్త జేపీఎస్‌లను తీసుకోవాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news