మోడ్రన్ టెక్నాలజీ, స్వచ్ఛ ఇంధనం, సూపర్ క్వాలిటీకి టెస్లా కార్లు పెట్టింది పేరు. అందుకే ఈ కార్లకు వరల్డ్ వైడ్గా యమా క్రేజ్. ఇప్పటికే చైనా, అమెరికా వంటి దేశాల్లో ఈ కార్ల హవా జోరుగా సాగుతోంది. అయితే ఇండియాకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని భారతీయులు చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. మన దేశ రోడ్లపై టెస్లాను రయ్ రయ్ అనిపించాలని ఎదురుచూస్తున్న చాలా మంది వాటి ధరను చూసి వెనకడుగేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో టెస్లా ప్రవేశంపై గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. తాజాగా దీనిపై ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే..?
టెస్లాకు చెందిన కొంతమంది సీనియర్ ఉన్నతోద్యోగులు ఈవారంలోనే భారత్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన కీలక అధికారులతోనూ వీరు భేటీ అయ్యే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. అయితే, దీనిపై ఇటు ప్రభుత్వం నుంచి కానీ, అటు టెస్లా నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.