హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారం పదునెక్కింది. పోలింగ్‌కు మరో ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో టీఆర్ఎస్, కాంగ్రెస్‌తోపాటు బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈసారి ఎలాగైనా విజయ పతాకం ఎగురవేయాలని అధికార టీఆర్ఎస్ సర్వ శక్తులు ఒడ్డుతుండగా.. వరుస విజయాల పరంపర కొ నసాగించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. మరోపక్క బీజేపీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భా విస్తుండటంతో పోరు రసవత్తరంగా మారింది. ప్రధానంగా అధికార టీఆర్ ఎస్, కాంగ్రెస్‌కు మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ నెలకొంది.
గత ఎన్నికల్లో టీఆర్ ఎస్ తరుపున పోటీ చేసి ఓటమిపాలైన శానంపూడి సైదిరెడ్డి మరోమారు బరిలోకి దిగారు. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుసగా మూడుసార్లు విజయంసాధించిన హుజూర్‌నగర్‌లో ఈసారి ఆయన సతీమణి పద్మావతిరెడ్డిని పోటీకి దించారు. అభివృద్ధికి ఓటేయాలని టీఆర్ ఎస్ కోరుతుండగా, చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు కావడం.. 2009 నుంచి వరుసగా ఇక్కడ నుంచి విజయం సాధించడంతో ఉత్తమ్‌కు ఈ ఎన్నిక కీలకంగా మారింది.
బీజేపీ అభ్యర్థి రామారావు, టీడీపీ అభ్యర్థి కిరణ్మయి తమ ఓటు బ్యాంక్‌ను పదిలపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు బండి సంజయ్, అర్వింద్‌తోపాటు ఆపార్టీ నేత వివేక్ తమ పార్టీ అభ్యర్థి రామారావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇక కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక టీ టీడీపీ అధ్యక్షడు ఎల్ రమణ తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వీరితోపాటు బరిలో ఉన్న మరో 15 మంది అభ్యర్థులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన టీడీపీ ఈసారి సొంతంగా బరిలోకి దిగుతుండగా, తెలంగాణ జన సమితి ఈసారి కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తోంది. సీపీఐ మొదట టీఆర్ ఎస్‌కు మద్దతు ప్రకటించగా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా తన మద్దతును ఉపసంహరించుకుంది. నేడోరేపో ఏ పార్టీకి మద్దతునిచ్చే అంశంపై స్పష్టత ఇవ్వనుంది. మొత్తానికి పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో హుజూర్‌నగర్‌లో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.
గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. అయితే ఓటరు దేవుడు ఎవరిని కరణిస్తాడో తెలియాలంటే మాత్రం ఈనెల 24న ఫలితాలు విడుదలయ్యే వరకు వేచిచూడాలి. ఇక గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఓటరు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని 7 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఆ వెంటనే నాలుగు నెలలకు ఈ ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అదే నియోజకవర్గ ఓటరు నల్లగొండ ఎంపీగా పోటీ చేసిన ఉత్తమ్‌కు 12,990 ఓట్ల మెజార్టీ కట్టబెట్టారు. మరి ఇప్పుడు మళ్లీ ఐదు నెలలకు అక్కడ ఓటరు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నాడో ? చూడాలి.