పోలవరం ప్రాజెక్టుపై ఉమ్మడి సర్వే చేపట్టి ముంపు పరిధిని గుర్తించే వరకు జలాశయంలో నీటిని నిల్వ చేయవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీని (పీపీఏ) తెలంగాణ కోరింది. సుప్రీంకోర్టు సూచనలు, కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఆదేశాల మేరకు ఉమ్మడి సర్వే పూర్తికానందున ఈ ఏడాది నీటిని నిల్వ చేయొద్దని సూచించింది. పోలవరం వెనుక జలాలతో తెలంగాణ భూభాగంలో ముంపు ఏర్పడుతోందని.. ఈ మేరకు పీపీఏకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖలో పేర్కొన్నారు.
‘ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్ 150 అడుగులు) వద్ద నీటిని నిల్వ చేస్తే తెలంగాణలో 899 ఎకరాలు ముంపునకు గురవుతోంది. గతేడాది జులైలో గోదావరికి వచ్చిన భారీ వరదల సమయంలో పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంది. దీంతో వెనుక జలాలు పోటెత్తాయి. కానీ, ఏపీ మాత్రం నీటి నిల్వ లేదని చెబుతోంది. నిల్వకు సంబంధించిన ఆధారాలను పంపుతున్నాం. వెంటనే రివర్ క్రాస్ సెక్షన్లు, వరద అంచనా, ముంపు ప్రభావంపై అధ్యయనం చేయించాలి’ అని లేఖలో పీపీఏకు వివరించారు.