ఇటీవల ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీరని విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. వందల మంది ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికీ వందల మంది మృతదేహాలు గుర్తుపట్టని స్థితిలో ఉన్నాయి. ఈ ఘటన దేశంలోనే పెను విషాదంగా నిలిచింది. ఈ ఘటనతో రైల్వే సేవలపై సామాన్యులకు ఒక్కసారిగా నమ్మకం సన్నగిల్లినట్లయింది. రైళ్లలో ప్రయాణించాలంటే ప్రయాణికులు కాస్త సంశయించే స్థితికి చేరింది.
ఈ ఘటన మరవకముందే మరో రైలులో బోగీ చక్రాలలో పగుళ్లు ఏర్పడిన ఘటన చోటుచేసుకుంది. కొల్లం-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ చక్రాల పైభాగంలో పగుళ్లు ఏర్పడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కేరళ రాష్ట్రం కొల్లం నుంచి చెన్నై ఎగ్మూర్ వెళ్లే కొల్లం-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం సెంగోట్టై రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఎప్పటిలాగానే స్టేషన్‌లో రైల్వే సిబ్బంది బండిని పరిశీలించారు. ఎస్-3 బోగీ చక్రాల పైభాగంలో పగుళ్లు కనిపించడంతో ఉన్నతాధికారులకు తెలియజేశారు. అనంతరం ఆ బోగీని తొలగించి అందులో ఉన్న ప్రయాణికులను వేరేచోట సర్దుబాటు చేశారు. దీంతో సుమారు గంట ఆలస్యంగా రైలు బయలుదేరింది.