మణిపూర్‌లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. సిరౌలో తిరుగుబాటుదారులు దారుణానికి పాల్పడ్డారు. రెండు తెగల మధ్య ఘర్షణలతో ఉద్రిక్తంగా మారిన మణిపూర్‌లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాను మృతి చెందాడు. ఇద్దరు అసోం రైఫిల్స్ జవాన్లు గాయపడ్డారు. మణిపూర్‌లోని కాక్‌చింగ్ జిల్లా సీరౌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
తీవ్రవాద ముఠా సభ్యులు కాల్పులు జరపగా భద్రత బలగాలు తిప్పికొట్టారు. ఈ ఘటనలోనే బీఎస్ఎఫ్ జవాన్ అమరుడైనట్లు సైన్యం ప్రకటించింది. గాయపడిన ఇద్దరిని హెలికాఫ్టర్‌లో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. తీవ్రవాద ముఠా కోసం బీఎస్ఎఫ్, అసోం రైఫిల్స్, పోలీసు బలగాలు విస్తృతంగా గాలిస్తున్నట్లు వెల్లడించింది. మరో ఘటనలో. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఫయేంగ్‌లో అనుమానిత కుకీ తీవ్రవాదులకు, భద్రత బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కానీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వివరించారు.
మరోవైపు సోమవారం కాంగ్‌చూప్ జిల్లాలో రెండు వర్గాలకు చెందిన కొంత మంది పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో ముగ్గురు చనిపోయారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారు ఇంఫాల్ సర్కారీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.