తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఇటీవలే తెలంగాణకు 5 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ఏకంగా యూకేలోని గ్రీన్ ఆర్గనైజేషన్.. రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలను గ్రీన్ యాపిల్ అవార్డులకు ఎంపిక చేసింది. ఇక తాజాగా రాష్ట్రానికి మరో 3 జాతీయ పురస్కారాలు లభించాయి. నాలుగో జాతీయ జల అవార్డుల్లో రాష్ట్రానికి 3 పురస్కారాలు వచ్చాయి.
జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా జగన్నాథపురం గ్రామం ఎంపిక అయింది. భద్రాద్రి జిల్లా జగన్నాథపురానికి ఉత్తమపంచాయతీ అవార్డు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది. ఉత్తమ జిల్లా కేటగిరీలో ఆదిలాబాద్‌కు మూడో స్థానం లభించిందని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. ఉత్తమ సంస్థల విభాగంలో ఉర్దూ వర్సిటీకి రెండో స్థానం దక్కిందని పేర్కొంది. ఈ నెల 17వ తేదీన దిల్లీలో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం జరగనుంది. ఈ వేడుకకు రాష్ట్ర సర్కార్ తరఫున మంత్రులు లేదా ఉన్నతాధికారులు హాజరై అవార్డు స్వీకరించనున్నారు.