తెలంగాణలో వైద్యవిద్య చదవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. మరిన్ని ఆప్షన్లు ఉండే విధంగా రాష్ట్రంలో మరో 8 వైద్య కళాశాలలు ప్రారంభించాలని సర్కార్ యోచిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే మరో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను కొత్తగా ప్రారంభించడానికి ప్రతిపాదనలను రూపొందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వచ్చే ఏడాదికి అన్ని జిల్లాల్లో ఒక్కో ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమని గుర్తుచేశారు.
‘‘ప్రజలకు జిల్లా స్థాయిలోనే స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే ప్రతి జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాలను స్థాపిస్తున్నాం. ఇప్పటికే 33 జిల్లాలకు 25 చోట్ల ఏర్పాటు చేశాం. మిగిలిన ఎనిమిది జిల్లాల్లోనూ ప్రారంభించేందుకు అవసరమైన భూకేటాయింపులు, ఇతర పనులను వేగవంతం చేయాలి. జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది కలగకుండా జాతీయ వైద్యమండలి మార్గదర్శకాల ప్రకారం మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలి. వైద్యరంగంలోని వివిధ విభాగాల్లో తెలంగాణ చాలా ముందుందనికేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.’’ అని హరీశ్ రావు అన్నారు.