తెలంగాణ పల్లెవెలుగు బస్సుల్లో టీ-9 టికెట్‌

-

తెలంగాణ ఆర్టీసీ మరో సరికొత్త ఆఫర్​తో ముందుకొచ్చింది. పల్లెవెలుగు బస్సుల్లో అధికంగా ప్రయాణించే మహిళలు, వృద్ధుల కోసం కొత్తగా ‘టి-9’ టికెట్‌ను ప్రవేశపెట్టింది. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆర్టీసీ ఇప్పటికే టీ-24, టీ-6, టీ-9 టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. వాటికి మంచి స్పందన వస్తుండటంతో గ్రామీణ, పట్టణ బస్సుల్లోనూ ప్రవేశపెట్టనుంది. ‘పల్లెవెలుగు బస్సుల్లో నిత్యం 15 లక్షల మంది ప్రయాణిస్తారు. అందులో మహిళలు, వృద్ధులే అధికం. వారికి ఆర్థికభారం తగ్గించడం కోసమే టీ-9 టికెట్‌కు శ్రీకారం చుడుతున్నాం’ అని సజ్జనార్‌ వివరించారు. పూర్తి వివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

పల్లెవెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద టీ-9 టికెట్లు లభిస్తాయి. మహిళలు, వృద్ధులు రూ.100 చెల్లించి టికెట్‌ పొందితే 60 కి.మీ పరిధిలో రానుపోను ప్రయాణించొచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే చెల్లుబాటు అవుతుంది. 60 ఏళ్ల పైబడిన వారు ధ్రువీకరణకు ఆధార్‌కార్డు చూపాలని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ టికెట్లను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు మాత్రమే ఇస్తారని, తెలంగాణ పరిధిలో ప్రయాణానికే వర్తిస్తాయని షరతులు విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news