రోజురోజుకు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కాయగూరలు కొందామని మార్కెట్‌కు వెళ్తున్న సామాన్యులు ధరలు చూసి తట్టుకోలేక ఖాళీ సంచులతో ఇంటికి తిరుగు పయనమవుతున్నారు. కూరల్లో అత్యంత ముఖ్యమైన టమాట, మిర్చిల ధరలు అన్నింటికంటే ఎక్కువగా ఉండటంతో బెంబేలెత్తిపోతున్నారు. చాలా వరకు అవి లేకుండా కూరలు చేస్తూ మమ అనిపిస్తున్నారు.
ముఖ్యంగా గత కొన్ని రోజులుగా టమాటా ధర భారీగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రూ.100కు చేరిన టమాట ధర తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో పలికింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అక్కడ కిలో రూ.124కి చేరింది.
మార్కెట్‌కు సాధారణంగా 1500 టన్నులు టమాటా వచ్చేంది. గురువారం మాత్రం 750 టన్నులు మాత్రమే వచ్చింది. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి.. ఏ గ్రేడ్ టమాటా కిలో రూ.106 నుంచి రూ.124, బీ గ్రేడ్ రూ.86 నుంచి రూ.105 వరకు పలికింది. సగటున రూ.100 నుంచి 110 వరకు పలికినట్లు మార్కెట్ యార్డు కార్యదర్శి అభిలాష్ తెలిపారు.