తెలంగాణలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే భారీగా చేరికలు చేపడుతోంది. మరోవైపు క్యాడర్‌ను బలంగా మార్చుకుంటోంది. రాష్ట్రంలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ నిర్వహించనున్న జనగర్జన బహిరంగ సభకు ఖమ్మం నగరం ముస్తాబైంది. నగరం చుట్టూరా కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్స్, భారీ ఫ్లెక్సీలతో కాంగ్రెస్‌లో సరికొత్త సందడి సంతరించుకుంది. అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ బహిరంగ సభను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
ఈ సభకు భారీ జనసమీకరణ చేసింది. ఖమ్మంలోని SR గార్డెన్స్ సమీపంలోని ఖాళీ స్థలంలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకుంటారు. బహిరంగ సభా వేదికకు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగి సభలో పాల్గొంటారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి రాహుల్.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు.