తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2014 జూన్ తర్వాత ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో కాంపిటీటివ్ అథారిటీ కోటాలోని వంద శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీల అడ్మిషన్ నిబంధనలు-2017 ను సవరిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేసి, నోటిఫికేషన్ ఇచ్చారు. ఆర్టికల్ 371-డి నిబంధనలకు లోబడి ప్రవేశ నిబంధనలను సవరించినట్లు ఆయన తెలిపారు.
తాజా ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో ఏర్పాటైన 36 మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకే కేటాయించడం జరుగుతుంది. తాజా నిర్ణయంతో 2014 జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటైన 36 మెడికల్ కాలేజీల్లో 100 శాతం కాంపిటేటివ్ అథారిటీ కోటా సీట్లన్నింటినీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తారు. దీంతో తెలంగాణ విద్యార్థులకు 520 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా లభించనున్నాయి. పాత విధానం కొనసాగితే కొత్తగా ఏర్పాటు చేసిన 36 వైద్య కళాశాలల్లోనూ 15 శాతం ఉమ్మడి కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుందని గుర్తించి ఉమ్మడి కోటాను పాత 20 మెడికల్ కాలేజీలకే పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సవరించింది.