నైరుతి రాకతోనూ తెలంగాణలో అంతగా వర్షాలు కురవడం లేదు. గతేడాదితో పోలిస్తే జూన్, జులైలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న గుడ్ న్యూస్ చెప్పారు. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఈ నెల 16న గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఇది తీవ్రమైతే ఈ నెల 18 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు చెప్పారు.
శుక్రవారం రోజున ఉత్తర కోస్తాంధ్రపై 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. శుక్రవారం స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా గూడూరు(జనగామ జిల్లా)లో 2.5, లోకరి(ఆదిలాబాద్)లో 2.3 సెంటీమీటర్లు కురిసింది. రాష్ట్రంలో సరిపడా వర్షాలు లేక చాలా వరకు ప్రాజెక్టులు నీరు లేక వెలవెలబోతున్నాయి.