ఐకమత్యమే మహా బలం అని చిన్నప్పుడు మనం పాఠం చదువుకున్నాం కదా. ఇప్పుడు అది నిజం అని నిరూపించేలా ఓ సంఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలుకా పరిసరాల్లో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. సాధారణంగా ‘పులి దాడిలో గేదె మృతి’ అనే వార్తలు చూస్తాం కానీ గేదెలు పులి మీద మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చిన అరుదైన ఘటన జరిగినట్లు వెల్లడించారు.
చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకా పరిసరాల్లో కొంతకాలంగా పులి సంచరిస్తూ.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోందని అటవీ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం మూల్ తాలూకాలోని ఎస్‌గావ్ గ్రామ పరిసరాల్లో ఓ పశువుల కాపరిపై దాడికి యత్నించిందని. చేతిలో ఉన్న గొడ్డలితో ఎదురు తిరగడంతో త్రుటిలో అతడికి ప్రాణాపాయం తప్పిందని వెల్లడించారు. తర్వాత బెంబాడా గ్రామంలోని అటవీ పరిసరాల్లో మేత మేస్తున్న ఆవులు, గేదెలపై పులి దాడి చేసిందని.. ఈక్రమంలో గేదెలు భయంతో పరుగెత్తకుండా.. ఐకమత్యంగా ఉండి పులిని కొమ్ములతో పొడిచాయని చెప్పారు. తీవ్రంగా గాయపడిన పులిని చికిత్స కోసం చంద్రపూర్ తరలించగా.. చికిత్స పొందుతూ పులి అదేరోజు రాత్రి చనిపోయిందని అధికారులు పేర్కొన్నారు.