ప్రజల, వాహనాదారుల అవస్థలను తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఔదార్యం చాటుకుంది. ఐదు సంవత్సరాల కిందట శంకుస్థాపన చేసిన ఉప్పల్ – నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనుల జాప్యంపై, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సీఎం కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వరంగల్ జాతీయ రహదారిపై చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగుతున్నాయి.
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లు ఈ రోడ్డును ఆధునీకరించాల్సి ఉంటుంది. కానీ ఎలివేటెడ్ కారిడార్ పనులు మరో రెండు మూడేండ్లైనా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలోనే మంత్రి చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి సోమవారం డా.బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి ఉప్పల్, నారపల్లి రోడ్డు పరిస్థితిని వివరిస్తూ ఓ వినతిపత్రం అందించారు.
వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ ఉప్పల్ నుంచి నారపల్లి సీపీఆర్ఐ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులతో నిమిత్తం లేకుండా, ప్రజల, వాహానాదారుల సౌకర్యార్థం కారిడార్‌కు రెండు వైపుల నాణ్యమైన బీటీ రోడ్డు వేయాలని ఆర్ అండ్ బీ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉప్పల్, నారపల్లి మీదుగా యాదాద్రి, వరంగల్ వరకు లక్షల వాహానాలు రాకపోకలు సాగిస్తున్న రోడ్డును వెంటనే ఆధునీకరించాలని, ఎన్నినిధులు ఖర్చు అయినా సరే సాధ్యమైనంత త్వరగా బీటీ రోడ్డు వేయాలని సీఎం కేసీఆర్ మంత్రితో పాటు ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులను సూచించారు.