దూరప్రాంతాలను సులభతరం చేసేందుకు.. ప్రయాణికులకు కాస్త ప్రయాణసమయం తగ్గించడానికి.. భారత ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ రైళ్లు వేగంగా పరిగెడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని కాచిగూడ నుంచి ఏపీలోని నంద్యాల జిల్లా డోన్ మీదుగా యశ్వంతపుర్కు ఆగస్టు 6న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
గుంతకల్లు డివిజన్లో డోన్ రైల్వేస్టేషన్ మొదటిది కావడంతో ఇక్కడి నుంచి ప్రారంభోత్సవాలు జరగనున్నాయని చెప్పారు. డోన్ నుంచి కాచిగూడ వరకు సోమవారం ఉదయం 5-6 గంటల మధ్య వందేభారత్ ట్రయల్ రన్ జరిగిందని తెలిపారు గుంతకల్లు డివిజన్లోని డీఆర్ఎంతో పాటు పలు విభాగాలకు చెందిన అధికారులంతా డోన్‌లో జరిగే ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారని, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం రైల్వేస్టేషన్లలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని పేర్కొన్నారు.