హైదరాబాద్‌లో పార్కింగ్‌ సమస్యకు ఎలా చెక్‌ పెడదాం.. నెటిజన్ల సలహా కోరిన మంత్రి కేటీఆర్

-

హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఓ పెద్ద సమస్యగా పరిణమించింది. ఈ క్రమంలోనే ఆయన నెటిజన్లను హైదరాబాద్ పార్కింగ్ సమస్యకు సంబంధించి సలహాలు అడిగారు. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపాలని బిపిన్‌ సక్సెనా అనే నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌ ఈ విధంగా స్పందించారు.

హైదరాబాద్‌లోని ఓల్డ్‌ సిటీ, న్యూసిటీస్‌లో పార్కింగ్‌ అనేది ప్రధాన సమస్యగా మారింది. సికింద్రాబాద్‌, ఓల్డ్‌ సిటీల్లోని మార్కెట్లకు దగ్గరలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి.. అందులో పార్కింగ్ కోసం బిల్డింగ్‌లను నిర్మించాలని బిపిన్‌ సక్సేనా అనే వ్యక్తి ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ను కోరారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్‌.. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు పార్కింగ్‌ అనేది ప్రధాన సమస్యగా మారిందని అంగీకరిస్తూ.. పార్కింగ్‌ సమస్య తలెత్తకూడదనే.. కొత్తగా నిర్మించబోయే మెట్రో మార్గాల్లో పెద్ద ఎత్తున పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేసి పార్క్‌ అండ్‌ రైడ్‌ మోడ్‌ను ప్రయోగాత్మకంగా ప్రయత్నించబోతున్నామని తెలిపారు.

అలాగే ప్రజలు స్థానిక మున్సిపల్‌ అధికారులతో కలిసి తమ ఖాళీ స్థలాలను పార్కింగ్‌ స్థలాలుగా మార్చుకుని రెగ్యులర్‌ ఆదాయం పొందవచ్చని కేటీఆర్‌ సలహా ఇచ్చారు. ఇవే కాకుండా పార్కింగ్‌ సమస్యను పరిష్కరించడం కోసం తమ టీమ్‌ మరిన్ని ఆలోచనలు చేస్తోందని.. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ప్రజల వద్ద ఎలాంటి ఆలోచనలు ఉన్నా స్వీకరిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news