యూపీఐ చెల్లింపులు నేడు బీభత్సంగా పెరిగిపోయాయి. ఫోన్‌పే, పేటీఎం లాంటి యాప్స్ మన వాడకాన్ని చూసి లోన్స్ కూడా ఇస్తున్నాయి. గెట్ ఇన్‌స్టెంట్‌లోన్ అప్‌టూ 3 లాక్స్ అంటూ మీరు మీ ఫోన్‌లో చూసే ఉంటారు. అవసరం ఉంది కదా మీరు ఇలాంటి డిజిటల్ రుణాలు తీసుకుందాం అనుకుంటున్నారా..? జర ఆగండి..! అప్పులు తీసుకోవాల్సి వస్తే తెలుసుకోవాల్సిన విషయాలేమిటో చూద్దాం.
అప్పు తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆర్‌బీఐ అనుమతి ఉన్న సంస్థలనే ఎంచుకోవాలి. బ్యాంకులు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలేవైనా సరే తప్పకుండా ఆర్‌బీఐ దగ్గర నమోదై ఉంటాయి. వీటి నుంచి మాత్రమే రుణం తీసుకోవాలి. ఆర్‌బీఐ గుర్తించని సంస్థల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్లలో, యాప్‌లలో మాత్రమే రుణం ఇచ్చే వారు తర్వాత మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడతారని మర్చిపోవద్దు. గతంలో ఇలాంటి అనుమతి లేని సంస్థలపై ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకుంది. అయినప్పటికీ కొన్ని సంస్థలు చట్ట విరుద్ధంగా రుణాలను ఇస్తూనే ఉన్నాయి.
అర్హతను తెలుసుకోండి
సాధారణంగా ఆదాయం, క్రెడిట్ స్కోరు ఆధారంగా ఆర్థిక సంస్థలు మీ రుణ అర్హతను నిర్ణయిస్తాయి. మీకు స్థిరమైన ఆదాయం, మంచి స్కోరు (750 కి మించి) ఉంటే బ్యాంకు నుంచి రుణం తీసుకోండి. మీకు తక్కువ అర్హత ఉంటే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ)ను ఎంచుకోండి. మీ క్రెడిట్ స్కోరు ఎల్లప్పుడూ తెలుసుకుంటూ ఉండండి. తక్కువ నిబంధనలు, వడ్డీతో రుణం తీసుకునేందుకు మీ క్రెడిట్ స్కోరు ఉపకరిస్తుంది.
ఛార్జీలు ఎలా ఉన్నాయో చూడండి..
మీ రుణ అర్హత వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది. మంచి స్కోరున్నప్పుడు తక్కువ వడ్డీ రేటుకు రుణం తీసుకునేందుకు ప్రయత్నించాలి. ఇప్పటికే తీసుకున్న రుణాలకు చెల్లింపులు ఆలస్యమైతే.. మీ స్కోరు తగ్గుతుంది. ఇలాంటప్పుడు వడ్డీ పెరుగుతుంది. రుణం తీసుకునేటప్పుడు అన్ని రుసుములనూ జాగ్రత్తగా పరిశీలించండి. ఇందులో మీ వార్షిక వడ్డీ రేటూ ఉండాలి. రుణ పరిశీలనా రుసుము, ఆలస్య/ముందస్తు చెల్లింపులకు వర్తించే ఛార్జీలు తెలుసుకోవాలి. ఆర్‌బీఐ నియంత్రిత రుణదాత ఈ వివరాలన్నీ తప్పనిసరిగా రుణగ్రహీతతో పంచుకోవాలి. ఇవన్నీ మీకు చెప్పడం లేదంటే.. కాస్త ఆలోచించాల్సిందే.
ఎంత మేర సమాచారం అడుగుతున్నారు..
రుణగ్రహీత సమాచారాన్ని ఎంతో సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్థిక సంస్థలదే. రుణాన్ని ఇచ్చేటప్పుడు అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరించాలి. నియంత్రిత పద్ధతిలో మాత్రమే సంబంధిత అంశాల్ని మూడో సంస్థలకు (లోన్ ప్రొవైడర్లు, రికవరీ ఏజెన్సీల వంటివి) అందించాలి. చాలా సందర్భాల్లో కొన్ని యాప్‌లు ఫొటోలు, వీడియోల వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించడం, రుణగ్రహీత ఫోన్‌లో ఉన్న నంబర్లను తీసుకొని, స్నేహితులు, బంధువులకు ఫోన్ చేయడంలాంటివి చేస్తాయి. ఇవన్నీ చట్ట వ్యతిరేకం. ఇలాంటి వాటి వలలో మీరు చిక్కుకోవద్దు. ఆర్‌బీఐ నియంత్రణలో ఉండే సంస్థల నుంచే అప్పు తీసుకోవడం సురక్షితం.
వడ్డీరేట్లు..
ఆన్‌లైన్‌లో అప్పు కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ముందుగా వడ్డీ రేట్లు, రుసుములు, తిరిగి చెల్లించేటప్పుడు ఉండే నిబంధనలు, షరతులను పోల్చి చూసుకోండి. అన్ని నియంత్రిత సంస్థలూ ఆన్‌లైన్‌లో ఈ సమాచారాన్ని అందిస్తాయి. పేరు తెలియని రుణదాతల నుంచి రుణం తీసుకుంటే.. తర్వాత చిక్కులు తప్పవు.