ఒకే వ్యక్తి ఫొటోతో 658 సిమ్ కార్డులు జారీ అయ్యాయి. ఈ సంఘటన విజయవాడ నగరం గుణదలలో చోటుచేసుకుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ ఫిర్యాదు మేరకు సూర్యారావుపేట పోలీసుల దీనిపై దర్యాప్తు చేయగా.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే ఫొటోతో ఓ నెట్వర్క్ సంస్థకు చెందిన 658 సిమ్‌లను అమ్మినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. సత్యనారాయణపురానికి చెందిన పోలుకొండ నవీన్ అనే యువకుడు వీటిని రిజిస్టర్ చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇదే తరహాలో అజిత్‌సింగ్‌నగర్, విస్సన్నపేట పోలీస్స్టేషన్ల పరిధిలో మరో 150 వరకు సిమ్ కార్డులు నకిలీ పత్రాలతో జారీ అయినట్లు గుర్తించినట్లు వెల్లడించారు.
సిమ్ కార్డుల మోసాలను అరికట్టేందుకు టెలికమ్యునికేషన్ల శాఖ కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఓ టూల్‌కిట్ వడపోతలో ఈ విషయం వెలుగు చూసినట్లు పోలీసులు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేసియల్ రికగ్నేషన్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ టెలికాం సిమ్ సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్ సాఫ్ట్వేర్ ద్వారా సిమ్‌కార్డు మోసాలను గుర్తించి, సంబంధిత నంబర్లను బ్లాక్ చేస్తోందని తెలిపారు. అన్ని టెలికాం ఆపరేటర్ల నుంచి సిమ్‌కార్డుదారుల చిత్రాలను తీసుకుని వడపోస్తుంది.