ఆన్​లైన్ గేమింగ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం.. పార్లమెంట్ నిరవధిక వాయిదా

-

పార్లమెంటు ఉభయ సభలు ఇవాళ నిరవధిక వాయిదా పడ్డాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి మణిపుర్ అంశం ఉభయ సభలను అట్టుడికించింది. చివరకు విపక్ష కూటమి ఇండియా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దాకా వచ్చింది. ఓవైపు అవిశ్వాస తీర్మానం.. మరోవైపు మణిపుర్​ అంశంపై వాడీవేడిగా సాగిన పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు ఇవాళ నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు లోక్​సభను వాయిదా వేస్తున్నట్లు తొలుత స్పీకర్​ ఓం బిర్లా ప్రకటించారు.

సభ దాదాపు 39 గంటలు పనిచేసిందని స్పీకర్​ ఓం బిర్లా వెల్లడించారు. కీలకమైన డిజిటల్​ పర్సనల్​ డేటా ప్రొటెక్షన్​ బిల్లు 2023, దిల్లీ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపిందని చెప్పారు. మరోవైవు, రాజ్యసభను కూడా నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఉపరాష్ట్రపతి జగ్​దీప్​ ధన్​ఖడ్​ ప్రకటించారు.

ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధించే బిల్లులకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో కేంద్ర వస్తు సేవల పన్ను సవరణ బిల్లు 2023, ఇంటిగ్రేటెడ్‌ వస్తుసేవల పన్ను సవరణ బిల్లు 2023కు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం తెలిపాయి. రెండు సభల్లోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ ఆమోదం పొందడం వల్ల ఈ మేరకు రాష్ట్రాల శాసనసభలు కూడా జీఎస్టీ చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news