ప్రధాని నరేంద్ర మోడీకి మణిపూర్ వెళ్లే ఆలోచన లేదని.. అక్కడి ప్రజలతో మాట్లాడి కనీసం భరోసా ఇచ్చే ఆలోచన లేదని అన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. మోడీ ఇరు వర్గాలతో మాట్లాడితే సమస్య ఇంతలా ఉండేది కాదని అన్నారు. కానీ ఆయనకు ఆ ఉద్దేశమే లేదని మండిపడ్డారు. ప్రధాని అంటే ప్రజలందరికీ ప్రతినిధి అని వెల్లడించారు. ప్రధాని అంటే దేశ ప్రజలను ప్రతిబింబిస్తూ మాట్లాడాలని.. చిల్లర రాజకీయాలను పక్కన పెట్టాలని సూచించారు.
కానీ మోదీ వ్యవహరిస్తున్న తీరు, ప్రసంగించిన తీరు చాలా బాధాకరంగా ఉందన్నారు. అసలు తాను ఏంటో మోడీకి అర్థం కావడం లేదన్నారు. మణిపూర్ ని హత్య చేశారని, రెండుగా చీల్చారని మాత్రమే తాను అన్నానని పేర్కొన్నారు. మణిపూర్ హింసను భారత ఆర్మీ రెండు రోజుల్లో అదుపు చేయగలదని.. కానీ అక్కడ హింస జరగాలని మోదీ కోరుకుంటున్నట్లు ఆరోపించారు. తన 19 ఏళ్ల అనుభవంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదు అన్నారు రాహుల్ గాంధీ.