హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటివరకు కురిసిన వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో 257 మంది ప్రాణాలు కోల్పోయారని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7000 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ పరీక్షలను వాయిదా వేసింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఇక సిమ్లాలోని సమ్మర్ హిల్ ఏరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి శివాలయంలో కొంత భాగం కూలిపోయింది. దీంతో 9 మంది భక్తులు చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో 40 నుండి 50 మంది వరకు భక్తులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. 50 మంది వరకు శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.