కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 ఇవాళ జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. ఈ అద్భుత ఘట్టాన్ని యావత్ భారత్ లైవ్లో వీక్షించనుంది. ఇందుకు ఇప్పటికే ఇస్రో ఏర్పాట్లు చేసింది. అయితే చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రక్రియను యావత్ దేశంతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఈ క్రమంలోనే దాయాది దేశం పాకిస్థాన్ కూడా దీనిపై ప్రశంసలు కురిపించింది.
పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ ఛౌదరీ చంద్రయాన్-3 ప్రయోగాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పాక్ మీడియా ఈ చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రయోగాన్ని ప్రసారం చేయాలని పోస్టులో పేర్కొన్నారు. మానవాళికి మరీ ముఖ్యంగా భారత అంతరిక్ష రంగానికి ఇవి చరిత్రాత్మక క్షణాలని అన్నారు. ఈ సందర్భంగా భారత్కు.. అభినందనలు’ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హయాంలో ఫవాద్.. సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.