కులగణన అధికారం కేంద్రానిదే.. సుప్రీంలో మోదీ సర్కార్ అఫిడవిట్

-

బిహార్ కుల గణన అంశం సుప్రీంకోర్టును చేరింది. ఆ రాష్ట్ర సీఎం నీతీశ్‌ ప్రభుత్వం తీసుకున్న కులగణన సర్వే నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించింది. జనాభా గణన కేంద్రానికి సంబంధించిన అంశమని పేర్కొంది. ఈ క్రమంలోనే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

జనగణన కేంద్ర జాబితాలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ అధికారం ఉందని అఫిడవిట్‌లో పేర్కొంది. జనాభా గణన చట్టబద్ధమైన ప్రక్రియ అని, జనాభా గణన చట్టం 1948 ప్రకారం దీన్ని చేపడతారని.. భారత రాజ్యాంగం ఏడవ షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో దీన్ని చేర్చినట్లు తెలిపింది. రాజ్యాంగంలోని నిబంధనలు, వర్తించే చట్టానికి అనుగుణంగా దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.

మరోవైపు.. బిహార్​లో కులగణన ఇప్పటికే పూర్తైందని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆగస్టు 6న సర్వే పూర్తి కాగా.. ఆగస్టు 12న సమాచారాన్ని అప్​లోడ్ చేశారని తెలిపింది. ఈ సమాచారం ప్రభుత్వ శాఖల వద్దే ఉంటుందని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news