తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే బీఆర్ఎస్ 115 మందితో తొలి జాబితా ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇవాళ్టి నుంచి అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో కీలక ప్రక్రియ ప్రారంభం కానుంది.
అయితే…. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముదిరాజ్ లు తమ డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీలు కచ్చితంగా ముదిరాజ్ లకు 10 అసెంబ్లీ టికెట్లను ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ తో తమ నిరసనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ పెద్ద ఎత్తున హైదరాబాద్ గండి మైసమ్మ దగ్గర ధర్నా చేపట్టారు తెలంగాణ ముదిరాజ్ సంఘం నేతలు.
గండి మైసమ్మ దగ్గర జరిగిన ఈ ధర్నాలో చినంగి వెంకటేశం మదిరాజ్ , దుండిగల్ గండిమైసమ్మ మండల అధ్యక్షుడు కొరివి రాము ముదిరాజ్, బోరంపేట ముదిరాజ్ అధ్యక్షుడు భాగయ్య మదిరాజ్, దుండిగల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కొరివి నర్సింగ రావు ముదిరాజ్ మరియు పిట్ల సత్యనారాయణ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం సభ్యులు దొంతి మహేష్ ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్, తలారి రాజ్ కుమార్ ముదిరాజ్, కృష్ణా ముదిరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చినంగి వెంకటేశం మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు కచ్చితంగా మదిరాజ్ లకు 10 అసెంబ్లీ టికెట్లను కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముదిరాజ్ లను చిన్న చూపు చూడకూడదని.. అధికార బీఆర్‌ఎస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు ముదిరాజ్ లకు న్యాయ బద్ధంగా టికెట్లు ప్రకటించాలని పేర్కొన్నారు చినంగి వెంకటేశం.