మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు బీజేపీలో చేరారు. చెన్నమనేని వికాస్ రావు ఆయన సతీమణి దీపాతో కలిసి బుధవారం కమలం పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో చెన్నమనేని వికాస్ రావు, ఆయన సతీమణి దీపా బీజేపీలో చేరారు. ఆయనకు కండువా కప్పి కిషన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ విధివిధానాలు నచ్చి అనేక మంది ప్రముఖులు పార్టీలో చేరుతున్నారని అన్నారు.
రాఖీ పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాఖీ పండుగ సందర్భంగా గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించిందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ తగ్గించలేదన్నారు. వంట గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు లేదని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వికాస్ రావు మాట్లాడుతూ.. నా జీవితం లో మరుపు రాని రోజు ఇది అని, భావోద్వేగమైన సంఘటన అని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు నాకు సుపరిచితులు.. తాను సంఘ పరివార చాయల్లోనే పెరిగాను అని చెప్పారు. ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆకాంక్ష మేరకు బీజేపీలో చేరినట్టు ప్రకటించారు. బీజేపీ తరుపున తాను ఎమ్మెల్యేగా వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని తెలిపారు. మా నాన్న గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు వికాస్ రావు.