పాలకుర్తిలో తెలంగాణ ప్రభుత్వంపై చినజీయర్ స్వామి పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణలో మూడు పువ్వులు ఆరు కాయలుగా పాలన సాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏ లోటు లేకుండా చూస్తోందని వ్యాఖ్యానించారు. పాలకుర్తి నియోజకవర్గం వల్మిడిలో నిర్మించిన రామాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి పాల్గొన్నారు. ఆలయాలు నిర్మించడం పెద్ద విషయమేమి కాదని.. కానీ ప్రాచీన ఆలయాల జీర్ణోద్ధరణ చేయడం చాలా గొప్ప కార్యమని చినజీయర్ స్వామి అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని వల్మీడి గ్రామంలోని వల్మిడి గుట్టపై ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నాలుగు రోజులుగా శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఆలయ పునరుద్ధరణ కోసం దాదాపు రూ.50 కోట్లు ఖర్చు చేశారు. వాల్మీకి మహర్షి రామాయణం రచించిన గుట్టపై అబ్బురపరిచే రీతిలో శ్రీరాముడి ఆలయం రూపుదిద్దుకుంది. భద్రాద్రిని మించి నిర్మించిన ఈ గుడిలో త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా శ్రీసీతారామ లక్ష్మణ సమేత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఒకప్పటి వాల్మీపురమే నేడి వల్మిడి. రాముడి నడయాడిని నేల, రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జన్మస్థలం అంటే నమ్మకం కలగకపోవచ్చు. కానీ.. పురాణ ఇతిహాసాలు తరతరాలుగా స్థానికులు చెప్పుకునే చరిత్రకు ఈ ప్రాంతం సజీవసాక్ష్యంగా నిలుస్తోంది.